Cricket: ఐసీసీ జరిమానా పడినా దూకుడు తగ్గించని రబాడ
- టెస్టు ర్యాంకింగ్స్ లో రబాడ అగ్రస్థానం
- టెస్టు టాప్ బ్యాట్స్ మన్ స్మిత్
- టాప్ టెన్ లో కోహ్లీ, జడేజా, అశ్విన్
సఫారీ పేసర్ కాసోగి రబాడ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తొలి టెస్టు వివాదం తరువాత చెలరేగి ఆడిన ప్రోటీస్ రెండో టెస్టు గెలుచుకున్నారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన రబాడ మొత్తం 11 వికెట్లు తీశాడు. దీంతో 902 పాయింట్లతో టెస్టు బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, ఆసీస్ తో జరిగిన తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసి, పెవిలియన్కు వెళ్తున్నప్పుడు దురుసుగా తాకాడు.
దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. అయనప్పటికీ రెండో టెస్టులో దూకుడు తగ్గించలేదు. దీంతో అతని ప్రవర్తన పట్టికలో ఒక పాయింట్ ను ఐసీసీ వేసింది. మూడు పాయింట్లు దాటితే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాలన్న సంగతి తెలిసిందే. అతని తరువాతి స్థానంలో 887 పాయింట్లతో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ నిలవగా, ఆ తరువాతి స్థానాల్లో టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (844), రవిచంద్రన్ అశ్విన్ (803) కొనసాగుతున్నారు. టెస్టు బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో 943 పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 912 పాయింట్లతో ద్వితీయస్థానంలో, జోరూట్ (881) మూడో స్థానంలో ఉన్నాడు.