Kannada: నటుడు కార్తీక్ పై దాడి... తప్పుడు కేసే... అసలు నిజాన్ని తేల్చిన పోలీసులు
- కారుతో యాక్సిడెంట్ చేసిన కార్తీక్
- ఆపై కారును, మొబైల్ ను ష్యూరిటీగా ఇచ్చాడు
- పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టాడు
- విచారణ అనంతరం పోలీసుల వెల్లడి
కన్నడ నటుడు విక్రమ్ కార్తీక్, తనపై దాడి జరిగినట్టు తప్పుడు దోపిడీ కేసు పెట్టి, పోలీసులను తప్పుదారి పట్టించారని పోలీసులు తేల్చారు. కార్తీక్ పెట్టిన కేసుపై విచారణ జరిపిన పోలీసులు వివరాలను వెల్లడిస్తూ, బసవేశ్వర నగర్ లో నివశిస్తున్న ఆయన, తనపై ఆరుగురు దాడి చేశారని ఫిర్యాదు ఇవ్వడంతో విచారించామని తెలిపారు. కార్తీక్ తన కారును అతి వేగంతో నడిపిస్తూ, రోడ్డు పక్కనే నిలిపి ఉన్న మరో కారును ఢీకొట్టాడని, సదరు వాహనం యజమాని కార్తీక్ ను నిలువరిస్తే, కారుకయ్యే మరమ్మతు డబ్బులు తాను ఇస్తానని చెప్పాడని పోలీసులు తెలిపారు. డబ్బు తెచ్చేంతవరకూ కారును, మొబైల్ ఫోన్ నూ ష్యూరిటీగా ఉంచుకోవాలని నమ్మబలికి, వాటిని ఇచ్చి వెళ్లాడని, ఆపై స్టేషన్ కు వచ్చి తనపై దాడి జరిగినట్టు తప్పుడు కేసు పెట్టాడని తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.