Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ మొత్తం నిషాద్ పైనే చర్చ!
- 29 ఏళ్లుగా గోరఖ్ పూర్ లో తిరుగులేని బీజేపీ
- 1998 నుంచి ఎంపీగా ఎన్నికవుతున్న ఆదిత్యనాథ్
- 29 ఏళ్ళ అప్రతిహత పాలనకు చరమగీతం పాడిన ప్రవీణ్ కుమార్ నిషాద్
ఉత్తరప్రదేశ్ లో ప్రవీణ్ కుమార్ నిషాద్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. 29 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని గోరఖ్ పూర్ స్థానాన్ని గెలుచుకుని బీజేపీకి షాక్ ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీయే ప్రవీణ్ కుమార్ నిషాద్. గోరఖ్ పూర్ లో 29 ఏళ్ల చరిత్ర బీజేపీ సొంతం, అంతే కాకుండా అది సీఎం ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం. ఆయన సీఎం కావడంతో ఖాళీ అయిన పార్లమెంటు స్థానం, దీనికి తోడు అక్కడ సుదీర్ఘకాలంగా గోరఖ్ నాథ్ మఠంలోని పూజారులే గెలుస్తూ వస్తున్నారు.
అలాంటి స్థానంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన 29 ఏళ్ల నిషాద్ విజయం సాధించడం బీజేపీకి మింగుడుపడడం లేదు. నిషాద్ అక్కడ ఎవరికీ పెద్దగా తెలియదు, ఒకరకంగా అనామకుడు. 1998 నుంచి ఆదిత్యనాథ్ కంచుకోటగా మారిన గోరఖ్ పూర్ లో విజయంపై సమాజ్ వాదీ పార్టీ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిషాద్ విజయం సాధించాడు. పోనీ అతనేమన్నా బాగా డబ్బున్నవాడా? అంటే అతని ఆస్తులు 11 లక్షల రూపాయలేనని తెలుస్తోంది. అలాంటి వ్యక్తి విజయం సాధించడం ఆశ్చర్యకరమని యూపీ వాసులు పేర్కొంటున్నారు.