parliament: వెనక్కి తగ్గని టీడీపీ, ఇతర పార్టీలు... పార్లమెంటు ఉభయ సభల స్తంభన... తొమ్మిదో రోజూ లోక్ సభ వాయిదా
- ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ సభ్యుల పట్టు
- వెల్ లోకి వచ్చి నినాదాలు
- చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వం
- పట్టించుకోని ప్రతిపక్షాలు
- లోక్ సభ రేపటికి వాయిదా... రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా విషయమై టీడీపీ ఎంపీలు నేడు కూడా పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశారు. ఉదయం లోక్ సభ ప్రారంభమైన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో టీడీపీ ఎంపీలు వెల్ లోకి వచ్చి ప్లకార్డులతో డిమాండ్ చేశారు. టీడీపీకి ఇతర పార్టీలు సైతం వివిధ అంశాల్లో జత కలవడంతో వరుసగా తొమ్మిదో రోజూ సభా కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
ఉదయం సభా కార్యకలాపాలు మొదలైన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ఇంతలోనే వివిధ పార్టీల సభ్యులు ప్లకార్డులతో తమ సీట్లలోంచి లేచి వెల్ లోకి వచ్చి నినాదాలు అందుకున్నారు. సభ సజావుగా నడిచేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీల సభ్యులు వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ కోరారు. పీఎన్ బీ స్కామ్, కావేరీ నీటి నిర్వహణ బోర్డు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటన చేశారు. అయినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
అటు రాజ్యసభ కూడా ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలతో స్తంభించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ, వైసీపీ సభ్యులు ప్రత్యేక హోదా కోసం, టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల పెంపు డిమాండ్ తో వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు అందుకున్నారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.