Nara Lokesh: చంద్రబాబు మొహంలో నవ్వుల పూయించిన నారా లోకేష్
- అలిపిరి బాంబ్ బ్లాస్ట్ గురించి ఫోన్ వస్తే భయపడిపోయాం
- భయంతో ఫోన్ చేస్తే.. నాన్న నాకే ధైర్యం చెప్పారు
- చంద్రబాబుకు మనోధైర్యం ఎక్కువ
అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటూ తమకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో, నాన్న ఎలా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయనకు భయంతో ఫోన్ చేస్తే... తిరిగి ఆయనే తనకు ధైర్యం చెప్పారని... ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండగలిగే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 2004లో టీడీపీ ఓడిపోయినప్పుడు కార్యకర్తలల్లో మనోధైర్యాన్ని నింపిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ కూడా కార్యకర్తల పిల్లల కోసం స్కూల్ కూడా ఏర్పాటు చేశారని, అక్కడకు వెళ్లి పాఠాలు కూడా చెప్పారని వెల్లడించారు.
తన భార్య సీమంతం సమయంలో తుఫాను వస్తే... కేవలం కొంత సేపు మాత్రమే ఫంక్షన్ లో ఉన్నారని... ఉన్నంతసేపు కూడా ఫోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారని నారా లోకేష్ చెప్పారు. నాన్నగారితో తాను ఒకానొక సందర్భంగా మాట్లాడుతూ, 'సార్ బ్యాటింగ్ మీరే, బౌలింగ్ మీరే, కీపింగ్ మీరే... ఫస్ట్, సెకండ్, థర్డ్ స్లిప్స్ లో కూడా మీరే... మాలాంటివాళ్లకు అవకాశం ఇవ్వండి' అంటూ సరదాగా అన్నానని తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన అంతగా కష్టపడతారని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ లోకేష్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో చిరునవ్వులు చిందాయి.