Chandrababu: నన్ను విమర్శిస్తే నీకేం వస్తుంది పవన్‌ కల్యాణ్‌?: మరోసారి చంద్రబాబు ఆగ్రహం

  • ఈ కష్ట సమయంలో ఎవరయినా మాట్లాడాల్సింది మన హక్కులపై
  • నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి
  • హక్కుల కోసం పోరాడకుండా నన్ను విమర్శిస్తున్నారు
  • మరోవైపు వైసీపీ నాటకాలు ఆడుతోంది

కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విమర్శలు గుప్పించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఏపీలో నాలుగేళ్ల పాటు కనపడని అవినీతి పవన్ కల్యాణ్‌కు ఈ రోజు కనపడిందా? అని నిలదీశారు. తనను విమర్శిస్తే పవన్ కు వచ్చే లాభం ఏంటని అన్నారు. ఈ కష్ట సమయంలో ఎవరయినా మాట్లాడాల్సింది మన హక్కులపై అని, నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. హక్కుల కోసం పోరాడకుండా తనను విమర్శిస్తున్నారని తెలిపారు.

తాను నాలుగేళ్లు ఓపిక పట్టానని, నాలుగేళ్లు బీజేపీ అన్యాయం చేసిందని, ఇక పోరాడుతున్నానని చంద్రబాబు చెప్పారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ రోజూ ఎవరికీ భయపడలేదని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరానని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము పోరాడుతున్నామని చెప్పారు.

మరోవైపు వైసీపీ నేతలు తనను విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదంటే ఎంత నీచమో ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీకి వెళ్లి రహస్య ఒప్పందాలు చేసుకుని, కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన వారికి బుద్ధి చెప్పేవరకు పోరాటం ఆపబోమని చంద్రబాబు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము పోరాడుతుంటే తనపై కొందరు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారని అన్నారు. పన్నుల రూపంలో మనం ఇచ్చిన డబ్బులే కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి ఇస్తోందని తెలిపారు. తమిళ రాజకీయాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిందని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, హోదా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. 

  • Loading...

More Telugu News