Chandrababu: ఎన్డీయేకు టాటా బైబై... బీజేపీతో పూర్తి కటీఫ్... అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నిర్ణయం
- హోదా ఇవ్వని ఎన్డీయే ఇక వద్దు
- చంద్రబాబుకు చెప్పిన అత్యధిక నేతలు
- విడిపోవడమే మంచిదన్న చంద్రబాబు
- ఎన్డీయేకు టాటా చెప్పేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించని ఎన్డీయే (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్) కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఉదయం ఎంపీలు, నేతలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తాను తీసుకున్న నిర్ణయాన్ని అందరికీ చెప్పారు. అంతకుముందు ఎన్డీయేలో కొనసాగడం, బీజేపీతో పొత్తుపై తుది అభిప్రాయం చెప్పాలని కోరగా, అత్యధికులు ఇక విడిపోవడమే మంచిదని చెప్పినట్టు తెలుస్తోంది.
ఆ వెంటనే బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్టీయేకు శాశ్వతంగా కటీఫ్ చెప్పేద్దామని చంద్రబాబు వెల్లడించారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, జరుగుతున్న రాజకీయ మార్పుల గురించి చెబుదామని ఆయన అన్నారు. ఇక ఎన్డీయే నుంచి తాము వైదొలిగామన్న సంగతిని స్పీకర్ కు, రాష్ట్రపతికి తెలియజేయాలని చంద్రబాబు ఆదేశించారు.