No Confidence Motion: నేటి అవిశ్వాసం నిలబడేనా? లోక్ సభలో తాజా బలాబలాలివి!
- నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
- చర్చ జరగాలని కోరుకుంటున్న టీడీపీ, వైసీపీ
- ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేదు
- అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? ఎన్ని పార్టీలు మద్దతిస్తాయి? ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి వస్తుందన్న అంశాలపై నేడు చర్చ సాగుతోంది. ఈ అవిశ్వాసంతో లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీకి ఎటువంటి నష్టమూ కలుగకున్నా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు దీన్ని వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, కూటమి నుంచి వైదొలగి, తమంతట తాముగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.
తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారగా, లోక్ సభలో ప్రస్తుత బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 331 మంది సభ్యుల బలముంది. బీజేపీ 273, శివసేన 18, టీడీపీ 16, ఎల్జేపీ 6, ఎస్ఏడీ 4, ఆర్ఎల్ఎస్పీ 3, ఏడీ 2, జేడీ (యూ) 2, నామినేటెడ్ సభ్యులు ఇద్దరితో పాటు, జేకే పీడీపీ, ఏఐఎన్ఆర్సీ, ఎన్పీపీ, పీఎంకే, ఎస్డీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరితో పాటు అవసరమైతే స్పీకర్ మద్దతు ఆ పార్టీకుంది. ఇక విపక్ష యూపీఏ కు 52 మంది సభ్యుల బలముండగా, అందులో కాంగ్రెస్ 48, ఐయూఎంఎల్ 2, కేసీ (ఎం) 1, ఆర్ఎస్పీ 1 ఉన్నారు. జనతా పరివార్ కూటమికి ఏడుగురు సభ్యుల బలముండగా, ఆర్జేడీ 3, ఐఎన్ఎల్డీ 2, జేడీ (ఎస్) 2 ఉన్నారు.
ఇక ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోని పార్టీల నుంచి 147 మంది ఎంపీలు లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. వారిలో అన్నాడీఎంకే 37, తృణమూల్ 34, బీజేడీ 20, టీఆర్ఎస్ 11, సీపీఐ (ఎం) 9, వైఎస్ఆర్ సీపీ 9 (నలుగురు టీడీపీలో చేరినా వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు కాబట్టి సాంకేతికంగా వైసీపీ సభ్యుల కిందే లెక్క), ఎస్పీ 7, ఎన్సీపీ 6, ఆప్ 4, ఏఐయూడీఎఫ్ 3, జేఎంఎం 2తో పాటు ఏఐఎంఐఎం, సీపీఐ, జేకేఎస్సీ, ఎస్ డబ్ల్యూపీ, జేఏపీ (ఎల్)లకు తలో సభ్యుడు ఉన్నారు. ఇతరులు ముగ్గురుండగా, ఐదు ఖాళీలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినా ఎన్డీయేకు 315 మంది సభ్యుల బలముంటుంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని అధికారానికి దూరం చేసే పరిస్థితి ఎంతమాత్రమూ ఉండదు.