Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి దెబ్బ మీద దెబ్బ!
- బీహార్ కు ఇంత వరకు నెరవేరని ప్రత్యేక హోదా హామీ
- పోరాటం ఉద్ధృతం చేసే దిశగా సీఎం నితీష్
- ఎన్టీయేలో భాగస్వామిగా ఉన్న జేడీయూ
- ఇప్పటికే కూటమి నుంచి వైదొలగిన చంద్రబాబు
తమకు అడ్డే లేదన్నట్టుగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదీకి దెబ్బ మీద దెబ్బ తగులులుతోంది. నిన్నటి వరకు మోదీ ప్రభుత్వానికి బలమైన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ కు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామంటూ గతంలో ప్రకటించి, ఇంతవరకు ఇవ్వకపోవడంతో నితీష్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇటీవలి కాలంలో ఆయన పలుమార్లు కోరారు. ఈ నేపథ్యంలో, ఇకపై స్పెషల్ స్టేటస్ డిమాండ్ ను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు.
గత వారం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో చేతులు కలిపిన వెంటనే, ప్రత్యేక హోదాను నితీష్ పక్కన పెట్టారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయక తప్పదనే నిర్ణయానికి నితీష్ వచ్చారు. ప్రస్తుతం జేడీయూ కూడా ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.