Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన ములాయం సింగ్, మమతా బెనర్జీ!
- టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిన ములాయం
- ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతించిన మమతా బెనర్జీ
- కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, తమకు మద్దతుగా ఇతర పార్టీలను కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసినట్టు సమాచారం. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు ములాయం పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతిస్తున్నామని, విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని చంద్రబాబుతో మమతా బెనర్జీ అన్నట్టు సమచారం.
కాగా, కేంద్రంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇరవై విపక్ష పార్టీలతో కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, ఆజాద్, జ్యోతిరాదిత్య సింథియా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతకం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్దతు కోరుతూ వారి సంతకాలు తీసుకునే పనిలో టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పటివరకు నలభై మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది.