Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ.. ఒక వేస్ట్ కమిటీ: నిప్పులు చెరిగిన చంద్రబాబు
- ప్రధాని మోదీని ఎందుకు అడగలేదు?
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
- రాష్ట్రంలో అలజడులు సృష్టించి... కేంద్రానికి మేలు చేయాలని చూస్తున్నారు
శాసన మండలిలో ప్రసంగిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా విమర్శలు గుప్పించారు. పవన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీనే ఒక వేస్ట్ కమిటీ అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న తనకు మద్దతుగా నిలవాల్సింది పోయి... ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటూ అడ్డంకులు కలిగించడం ఏమిటంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని నిలదీయకుండా... మధ్యవర్తులుగా ఉండటానికి వీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక విక్రయాలకు సంబంధించి ఒకటి, రెండు చిన్నచిన్న పొరపాట్లు జరిగితే... మైనింగ్ స్కామ్ అంటూ గాలి జనార్దన్ రెడ్డితో ముడిపెట్టారని చంద్రబాబు అన్నారు. ఎర్రచందనంపై తాను ఉక్కుపాదం మోపానని... దీనికి సంబంధించి తమిళనాడులో తనపట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమయిందని... అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా తనకు ఓ లేఖ రాశారని చెప్పారు. ఇలాంటి వాస్తవాలను పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీతో మాట్లాడకుండా, తన గురించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి... కేంద్రానికి మేలు చేయాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.