Chandrababu: ఒకరి వైఫల్యం 10 మంది మరణానికి కారణమైంది.. బాధాకరం!: చంద్రబాబు
- ఇది శాఖాపరమైన వైఫల్యం
- అధికారుల పనితీరు ప్రభుత్వ గౌరవాన్ని పెంచాలి
- అలసత్వం వహించే అధికారులకు క్షమించబోను
గుంటూరులో కలుషిత నీటి వల్ల 10 మంది దుర్మరణం చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు శాఖాపరమైన వైఫల్యమే కారణమని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి వైఫల్యం వల్ల 10 మంది చనిపోయారని అన్నారు.
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దాన్ని చక్కదిద్దేంత వరకు విశ్రమించరాదని చెప్పారు. విశాఖను హుదూద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు... మనమంతా ఎలా చేశామని... గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. అధికారుల పనితీరు ప్రభుత్వ గౌరవాన్ని పెంచేలా ఉండాలని చెప్పారు. అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించబోనని హెచ్చరించారు. రోడ్లను తవ్వడం, గుంతలను అలాగే వదిలేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. పైపు లైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, మురుగు కాల్వలను వెంటనే శుభ్రపరచాలని ఆదేశించారు.