CHINA PRESIDENT: జిన్ పింగ్ ఇక నిరంతరాయంగా చైనా అధ్యక్షుడే... రెండోసారి ఎన్నిక
- పార్లమెంటులో ఒక్క ఓటు మినహా అన్నీ ఆయనకే
- జీవించి ఉన్నంత కాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం
- ఉపాధ్యక్షుడిగా వాంగ్ నియామకం
పొరుగుదేశం చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆయన ఐదేళ్లపాటు అధ్యక్ష పాలన పూర్తి చేసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం రెండు సార్లకే అధ్యక్షుడిగా వుండే అవకాశం ఉంది. అంటే ఈ ప్రకారం 2023 వరకే ఆయన పాలనకు అవకాశం. అయితే, చిరకాలం పాటు జిన్ పింగ్ అధ్యక్షుడిగా ఉండేందుకు అక్కడి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించిన విషయం తెలిసిందే.
అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు కాల పరిమితిని ఎత్తేసింది. ఇందుకు అనుగుణంగా జిన్ పింగ్ ను మరోసారి అధ్యక్షుడిగా పార్లమెంటు ఈ రోజు ఎన్నుకుంది. 2,970 ఓట్లలో ఒక్క ఓటు మినహా మిగిలినవన్నీ జిన్ పింగ్ కు అనుకూలంగా పడినవే. జీవించి ఉన్నంత కాలం ఇక అధ్యక్ష పీఠం ఆయనకే సొంతం. ఉపాధ్యక్షుడిగా వాంగ్ కిషన్ ను అధ్యక్షుడు ప్రతిపాదించారు. దీంతో ఉపాధ్యక్షుడిగా వాంగ్ సైతం నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంది.