somu veerraju: పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి: బీజేపీ నేత సోము వీర్రాజు
- మేము వేసే ప్రశ్నలకు మీడియాలో కవరేజీ రావట్లేదు
- టీడీపీ వేసే ప్రశ్నలనే ఎక్కువ చూపుతున్నారు
- మేము ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేశాం, సమాధానాలు లేవు
బీజేపీ ఎప్పటికీ ప్రజల పక్షమే అని ఆ పార్టీ నేత సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో ఈ రోజు భేటీ ముగిసిన తరువాత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇక తమ కార్యవర్గ సమావేశాలు టీడీపీకి మిత్రపక్షంగా కాకుండా ప్రతిపక్షంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మీడియాలో తాము వేసే ప్రశ్నలను సరిగ్గా చూపించడం లేదని, టీడీపీ వేసే ప్రశ్నలనే ఎక్కువగా చూపుతున్నారని అన్నారు.
తాము ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేశామని, అయితే వాటికి సమాధానాలు చెప్పకుండా, వైసీపీ రాసిచ్చిన స్క్రిప్టును బీజేపీ చదువుతోందని టీడీపీ నేతలు చెబుతూ, తప్పించుకుంటున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పకుండా టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. తాము టీడీపీని అడుగుతోన్న ప్రశ్నలను పక్కనబెట్టి మీడియా టీడీపీ వేసే ప్రశ్నలనే చూపెడుతోందని అన్నారు.
ముందు చంద్రబాబును తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనండని సోము వీర్రాజు మీడియాతో అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అన్నారని, ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైల్లో పెడతామని అన్నారని పేర్కొన్నారు. ఇవన్నీ అన్ని వార్త పత్రికల్లోనూ అప్పట్లో వచ్చాయని, అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు మరోలా ఎందుకు మాట్లాడుతున్నారని మీడియా చంద్రబాబుని అడగాలని అన్నారు.