KTR: కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నాం: బాంబు పేల్చిన సిరిసిల్ల చైర్ పర్సన్ పావని... వీడియో చూడండి!
- పనుల విలువలో కొంత కమిషన్ తీసుకుంటాం
- మినిస్టర్ గారి ప్రోత్సాహంతోనే ఇదంతా
- ప్రతి మునిసిపాలిటీలో ఇదే జరుగుతుంది
- సంచలన వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల చైర్ పర్సన్ పావని
కాంట్రాక్టర్ల నుంచి రాజకీయ నాయకులు కమీషన్లు తీసుకోవడం మామూలే. చేస్తున్న పనుల విలువలో ఎంతో కొంత కమీషన్ ను స్థానిక నేతల నుంచి ప్రభుత్వ పెద్దల వరకూ ఎంతో కొంత ముట్టజెప్పాలని, లేకుంటే తమకు పనులు దక్కవని గతంలో కాంట్రాక్టర్లు ఎన్నోసార్లు వాపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ పట్టణ మునిసిపాలిటీ చైర్ పర్సన్, తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా నేత, ఏకంగా తాము ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, కాంట్రాక్టర్ల నుంచి 3 శాతం వరకూ కమిషన్ తీసుకుంటున్నామని, స్వయంగా మంత్రి గారే కమీషన్లు తీసుకోమని చెప్పారని అంటూ బాంబు పేల్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యపట్టణం సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా ఉన్న సామల పావన్, తన కార్యాలయంలో కూర్చుని మీడియాతో మాట్లాడుతూ, ఈ సంచలన వ్యాఖ్యలు చేయగా అదిప్పుడు వైరల్ అయింది. పర్సంటేజీలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించిన ఆమె, మినిస్టర్ గారి ప్రోత్సాహంతోనే తాము కమిషన్లు తీసుకుంటున్నామని, నిత్యమూ ప్రజాసేవలో ఉండే తమకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తే తప్పేంటని అడిగారు. కొందరు కాంట్రాక్టర్లు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ఇదే జరుగుతోందని తేల్చి చెప్పారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. పావని వ్యాఖ్యల వీడియోను మీరూ చూడండి.