Niloufer Hospital: విచిత్ర ఆకారంతో జన్మించిన శిశువు... స్టన్ అయిన వైద్యులు!
- పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చిన షాద్‌నగర్ మహిళ
- ఆరోగ్యంగా పుట్టిన ఆడ శిశువు...శరీర ద్వితీయార్థం చేప తోక మాదిరిగా పట్టిన మరో శిశువు
- అరుదైన పరిస్థితిగా వైద్యుల గుర్తింపు...నీలోఫర్‌కి తరలింపు
హైదరాబాద్ నగరంలోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శనివారం చిత్రమైన ఆకారంతో జన్మించిన శిశువును చూసి వైద్యులు స్టన్ అయ్యారు. శిశువు శరీరం పైభాగం మాత్రం మనిషి రూపంలోనే ఉన్నప్పటికీ, దిగువ భాగం మాత్రం చేప తోకను పోలి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, లక్ష జననాల్లో ఒకరు ఇలా పుడతారని వైద్యులు అంటున్నారు.
వివరాల్లోకెళితే... షాద్‌నగర్‌కి చెందిన 26 ఏళ్ల మహిళ సువర్ణ పేట్ల బురుజు ఆసుపత్రిలో సి-సెక్షన్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరి పిల్లల్లో ఆడ శిశువు దాదాపు 2.4 కిలోల బరువుంది. ఇక 1.2 కిలోల బరువుతో చిత్రమైన ఆకారంతో జన్మించిన మరో శిశువు ఆడా? లేక మగా? అన్న విషయాన్ని వైద్యులు నిర్థారించలేని పరిస్థితి. అందుకు కారణం, సదరు శిశువు శరీరం ద్వితీయార్థమంతా చేప తోక మాదిరిగా కలిసిపోవడమే. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో 'సిరెనోమిలియా' అంటారు. ఇలా విచిత్రంగా పుట్టిన శిశువును ప్రస్తుతం నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించామని పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రి సూపరింటిండెంట్ నాగమణి తెలిపారు.