Pawan Kalyan: రాజధానికి లంక భూములు ఎందుకు?: చంద్రబాబుపై పవన్ మరో విమర్శ
- భారీ వర్షాలతో నీట మునిగే లంక భూములు
- ఈ భూమి ఎందుకు తీసుకున్నారని పవన్ ప్రశ్న
- భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటని విమర్శలు
భారీ వర్షాలు కురిస్తే నీట మునిగే పల్లపు ప్రాంతాల భూములతో పాటు లంక భూములను రాజధాని నగర నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఆశించి సమీకరించిందో తెలియజేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ఉదయం అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం గ్రామానికి వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు.
అంతకుముందు లింగాయపాలెం గ్రామంలో పవన్ ఆగినప్పుడు, వర్షాలు వస్తే నీటమునిగే పొలాలను కూడా రాజధానికి ఇచ్చామని రైతులు చెప్పారు. నీటిలో మునిగే భూములను నగర నిర్మాణం నిమిత్తం తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన పవన్, లంక భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు సర్కారు అవసరం లేని భూములను కూడా తీసుకుందని, ఇక్కడ నిర్మాణాలు జరిగి, రేపు భారీ వర్షాలు పడితే అక్కడి సంస్థలు, నివాసం ఉండే ప్రజల పరిస్థితేంటని విమర్శించారు. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. మరికాసేపట్లో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.