Ganta Srinivasa Rao: అవిశ్వాస తీర్మానానికి 150 మంది మద్దతు: మంత్రి గంటా
- ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిశాం
- బీజేపీతో పొత్తు నష్టమని తెలిసినా కలిసి వెళ్లాం
- తెలుగువారి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు పోరాట మార్గం ఎంచుకున్నారు
- టీడీపీ నిర్ణయం చారిత్రాత్మకమైంది
గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందక పోవడంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏపీ సీఎం చంద్రబాబు పోరాట మార్గం ఎంచుకున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని, చంద్రబాబు నిర్ణయం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయకత్వం అవసరమని అనేక పార్టీలు కోరుతున్నాయని అన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి 150 మందికి పైగా సభ్యులు మద్దతిచ్చారని తెలిపారు.
కాగా, తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సినిమాలకు, రాజకీయాలకు ఉన్న తేడాను పవన్ కల్యాణ్ గుర్తించాలని అన్నారు. ఇటీవల జనసేన సభలో రెండు గంటలు ప్రసంగించిన పవన్ కల్యాణ్.. మోదీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారని గంటా ప్రశ్నించారు.