BJP: మిత్రధర్మాన్ని విస్మరించారు.. బీజేపీపై ఎస్‌బీఎస్పీ ఆగ్రహం

  • రాజ్యసభ అభ్యర్థుల విషయంలో తమను సంప్రదించలేదని ఎస్‌బీఎస్పీ మండిపాటు
  • ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న పార్టీ చీఫ్
  • తొమ్మిదో సీటుకు ఎస్‌బీఎస్పీ మద్దతు అవసరం

భారతీయ జనతా పార్టీపై మరో మిత్రపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రధర్మానికి ఆ పార్టీ నీళ్లొదిలిందని ఆరోపించింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమను మాటమాత్రమైనా సంప్రదించలేదని ఉత్తరప్రదేశ్‌లోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈనెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎస్‌బీఎస్పీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 8 స్థానాలు బీజేపీకి ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. 9వ స్థానాన్ని కూడా గెలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం బీజేపీకి 37 ఓట్లు అవసరం కాగా, మిత్రపక్షమైన ఎస్‌బీఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీకి 28 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇతర పార్టీల సభ్యులు కూడా తమకు మద్దతు ఇస్తారని, దీంతో తొమ్మిదో సీటు కూడా తమదేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ తమను సంప్రదించలేదని ఎస్‌బీఎస్పీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భార్ గుర్రుగా ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో డోలాయమానంలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఎస్‌బీఎస్పీ కనుక మద్దతు ఇవ్వకుంటే తొమ్మిదో సీటు విషయంలో బీజేపీ పెట్టుకున్న అంచనాలు తల్లకిందులయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News