KCR: ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం రూ. 1,00,116: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్
- రూ. 75 వేలకు తోడు మరో రూ. 25 వేలు
- ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు ప్రకటన
- తన మనసుకు దగ్గరైన పథకమన్న కేసీఆర్
పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఇస్తున్న ధన సహాయాన్ని పెంచుతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇస్తున్న మొత్తాన్ని లక్షా నూటపదహారు రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద అందే సాయాన్ని తొలుత రూ. 51 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఆ తరువాత దాన్ని రూ. 75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 3.65 లక్షల మందికి లబ్ది చేకూరిందని అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. పేదరికం ప్రజలను ఎన్నో రకాలుగా వేధిస్తుందని, పెళ్లి ఖర్చుకు భయపడి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయని, ఎంతో మంది అవివాహితలుగా మిగులుతున్నారని వ్యాఖ్యానించిన కేసీఆర్, పరిపాలనలో మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించిన మీదట పేద ఆడపిల్లలకు అండగా నిలవాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇది తనకెంతో ఇష్టమైన పథకమని, జనం మెచ్చిన పథకమని అన్నారు.