ali: నా మొదటి పారితోషికం 150 రూపాయలు: అలీ
- మిమిక్రీ చేస్తుండగా కె. విశ్వనాథ్ గారు చూశారు
- 'ప్రెసిడెంట్ పేరమ్మ' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు
- అమ్మకి 100 రూపాయలు ఇచ్చాను
తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తోన్న హాస్యనటులు ఎందరో వున్నారు. వాళ్లలో అలీ ప్రత్యేకంగా కనిపిస్తారు .. తనదైన డైలాగ్ డెలివరీతో కొత్తగా అనిపిస్తారు. హాస్యనటుడిగా సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తోన్న అలీ, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన తొలి సినిమా సంగతులు చెప్పుకొచ్చారు.
" నా చిన్నప్పుడు 'ప్రెసిడెంట్ పేరమ్మ' సినిమా షూటింగ్ కోసం దర్శకులు కె.విశ్వనాథ్ గారు తన యూనిట్ తో రాజమండ్రి వచ్చారు. అప్పుడు నేను 'జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా' లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉండేవాడిని. అక్కడ నన్ను చూసిన విశ్వనాథ్ గారికి నా చురుకుదనం నచ్చి .. 'సినిమాల్లో చేస్తావా?' అని అడిగారు. 'ఎందుకు చేయనండి .. చేస్తాను' అన్నాను నా స్టైల్లో".
"మర్నాడు ఉదయం వచ్చి కలమని చెబితే .. వెళ్లి కలిశాను. నన్ను చూడగానే ఆయన 'రమాప్రభ కొడుకు వేషం వుంది కదా .. అది వీడికి ఇవ్వండి' అన్నారు అక్కడున్న తన టీమ్ తో. రెండు రోజుల వేషానికి గాను ఆయన నాకు 150 రూపాయలు ఇప్పించారు. అందులో ఓ 100 రూపాయలు మా అమ్మకి ఇచ్చేసి .. 50 రూపాయలు నా జేబులో పెట్టుకున్నా. మా చెల్లికి ఓ ఐస్ క్రీమ్ కొనిపెట్టేసి .. ఇక డబ్బులు అయిపోయినట్టు చెప్పాను" అంటూ నవ్వేశారు.