Lok Sabha: కేంద్రం మొండి వైఖరి... నేడు కూడా చర్చకురాని అవిశ్వాసం!
- లోక్ సభ రేపటికి వాయిదా
- అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని ఉంది
- కానీ సభ ఆర్డర్ లో లేదన్న సుమిత్రా మహాజన్
తెలుగుదేశం, వైకాపాలు లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు కూడా చర్చకు రాలేదు. ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించి విఫలమయ్యారు.
సభ ఆర్డర్ లో లేదంటూ, అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ, కుదిరేలా లేదన్న ఆమె, సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందే రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంబిస్తోందని, అందుకే నేడు కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తాము మరింతగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.