vinod: లోక్సభలో మా నిరసన మేం తెలిపాం.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అది అడ్డుకాదు: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
- మా పార్టీకి, టీడీపీకి మధ్య పోటీ లేదు
- ఏపీ ప్రజలకు, చంద్రబాబు నాయుడుకు పాలనాపరమైన సమస్యలుంటే సాయం అందిస్తాం
- 52 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేస్తే సరిపోతుంది
పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో తమ తమ రాష్ట్రాల సమస్యలపై అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఈ విషయంపై టీఆర్ఎస్ స్పందించింది. పార్లమెంటు వెలుపల టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ... తమ పార్టీకి, టీడీపీకి మధ్య పోటీ లేదని, ఏపీ ప్రజలు, చంద్రబాబు నాయుడుకు పాలనాపరమైన సమస్యలుంటే తమవంతు సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
తమ పార్టీ ఎంపీలు ఈ రోజు లోక్సభలో తెలిపిన నిరసన టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానంపై చర్చకు అడ్డుకాదని అన్నారు. 52 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేస్తే సరిపోతుందని, అంతేగాక, గతంలో నిరసనల మధ్యే స్పీకర్ మూడు చట్టాలు ఆమోదించారని అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే టీఆర్ఎస్ ఎంపీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని తెలిపారు.