KCR: 'భవిష్యత్తులో దేశంలో మాదే అతిపెద్ద కూటమి'.. మమతా బెనర్జీతో భేటీ తరువాత కేసీఆర్ కీలక ప్రకటన
- ప్రజలు దేశంలో మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయి
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది
- 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవశ్యకతపై చర్చించాం
కోల్కతాలోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేసీఆర్, మమతా బెనర్జీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని తెలిపారు. అందుకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని, ఇందుకు సంబంధించిన మరికొంత మందితో చర్చించాల్సి ఉందని తెలిపారు. చాలా మంది మిత్రులు తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు విషయంలో ఈ రోజు జరిగిన ఈ సమావేశం తొలి అడుగు మాత్రమేనని, 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవశ్యకతపై చర్చించామని, భవిష్యత్తులో తమదే అతిపెద్ద కూటమిగా అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.