Chandrababu: చంద్రబాబుకు ఈ వ్యసనం గతంలో ఉండేది కాదు: ఉండవల్లి
- మన గురించి మనమే చెప్పుకోవడం..‘అహం’ కిందకు వస్తుంది
- బాబు టీమ్ లో ఆయన్ని గట్టిగా పొగిడేవాడెవడూ లేరు
- చంద్రబాబు, లోకేశ్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు
- జగన్ స్పీచ్ అర్థమైనట్టు చంద్రబాబుది అర్థం కాదు : ఉండవల్లి
తనను తానే పొగుడుకునే వ్యసనం చంద్రబాబుకు గతంలో ఉండేది కాదని, ఈ వ్యసనం ఈ మధ్య వచ్చిందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాజకీయాల్లో అందరికన్నా సీనియర్ నని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. 1978లో రాజకీయాల్లోకి ఆయన వచ్చారు. అంతకుముందు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు చాలా మంది దేశంలో ఉన్నారు. ‘సీనియర్’ నని చంద్రబాబు చెప్పుకుంటుంటే మనమేం చేస్తాం? ఆయన సీనియర్ కాదని నేను సంవత్సరం క్రితమే చెప్పాను.
సాధారణంగా, ఎవరి చేతన్నా మనం పొగిడించుకోవాలి గానీ, మన గురించి మనమే చెప్పుకోవడం.. ‘అహం’ కిందకు వస్తుంది. ఈ వ్యసనం చంద్రబాబునాయుడుగారికి గతంలో ఉండేది కాదు. తనను తానే పొగుడుకోవడమనేది చాలా భయంకరమైన వ్యసనం. చంద్రబాబునాయుడు టీమ్ లో ఆయన్ని గట్టిగా పొగిడేవాడెవడూ లేరు. దీంతో, చంద్రబాబు తనను తానే పొగుడుకుంటున్నారు! చంద్రబాబు నాయుడుగారికి అంత అవసరం ఉందని నేను అనుకోట్లేదు’ అన్నారు.
అసలు చంద్రబాబు, లోకేశ్ లకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఉండవల్లి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగం, జగన్ ప్రసంగం రెండింటిని వింటే.. జగన్ స్పీచ్ అర్థమైనట్టు చంద్రబాబుది అర్థం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.