family planning: ఒక్క మాత్రతో పిల్లలకు దూరం.. పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు!

  • మహిళల్లాగే పురుషులకూ గర్భనిరోధక మాత్రలు
  • తొలి దశ పరీక్షలు విజయవంతం
  • మలిదశ ప్రయోగాలకు సిద్ధం

ఇప్పటి వరకు మహిళలకే పరిమితమైన గర్భ నిరోధక మాత్రలు ఇకపై పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మాత్రల సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మహిళలతో పోలిస్తే చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకునేందుకు ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు.

దీంతో మహిళలకు ఉన్నట్టుగానే పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు తీసుకురావడం ద్వారా సంతానోత్పత్తిని నివారించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సరికొత్త మాత్రలను అభివృద్ధి చేసినట్టు ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్ తెలిపారు. తాము నిర్వహించిన తొలిదశ ప్రయోగం విజయవంతమైనట్టు తెలిపారు.

తొలి దశ ప్రయోగాల్లో భాగంగా వందమంది పురుషులకు తాము అభివృద్ధి చేసిన డైమిథడ్రోలోన్ అండీకానోయేట్ అనే రసాయనాన్ని మూడు వేర్వేరు మోతాదుల్లో అందించినట్టు చెప్పారు. అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు గుర్తించామని వివరించారు. ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌కు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, కొంచెం లావయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. తొలి దశ ప్రయోగం విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు స్టెఫానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News