Chandrababu: కాంగ్రెస్ పార్టీని మాత్రం మద్దతు అడగవద్దు... వెల్ లోకి ఎవరూ వెళ్లవద్దు: చంద్రబాబు ఆదేశం
- హోదాకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందనే నమ్ముతున్నా
- వారంతట వారుగానే అవిశ్వాసానికి మద్దతివ్వాలి
- 11 గంటల సమయంలో వెల్ లో ఎవరూ ఉండవద్దు
- ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన దిశగా చేస్తున్న పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతునూ కోరాలని చంద్రబాబు సూచించారు. హోదా కోసం తనంతట తానుగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఎవరూ కాంగ్రెస్ ఎంపీలను పిలవాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని మద్దతు అడగవద్దని, ఆ పార్టీ స్వతంత్రంగా మద్దతు ఇస్తుందని నమ్ముతున్నానని అన్నారు. 11 గంటల సమయంలో టీడీపీ సభ్యులెవరూ వెల్ లోకి వెళ్లవద్దని ఆదేశించారు. అవిశ్వాసంపై ఎన్ని నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, అవసరమైతే ఇతర పార్టీలతోనూ నోటీసులు ఇప్పించే ఆలోచనను చేయాలని ఎంపీలకు సూచించారు.