sbi: అకౌంట్లోకి అప్పనంగా పది కోట్లు వచ్చి పడ్డాయి.. అంతలోనే అకౌంట్ బ్లాక్ అయింది!
- 9,99,99,999 రూపాయలు క్రెడిట్ అయినట్టు మొబైల్ కి వచ్చిన ఎస్ఎంఎస్
- ఫేక్ మెసేజ్ అని భావించిన వినోద్
- మెసేజ్ నిజమేనని, ఆ మొత్తం అకౌంట్లో పడిందన్న బంధువులు, స్నేహితులు
పది కోట్లు తన అకౌంట్ లో పడ్డాయని సంబరపడి, వాటిని డ్రా చేసుకునేందుకు సంతోషంగా ఏటీఎంకి వెళ్లిన యువకుడికి ఆ అకౌంట్ బ్లాక్ అయిందన్న సమాధానంతో మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని జహంగిర్ పురి ఏరియాలో వినోద్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ లో అతనికి సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఆదివారం మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వినోద్ అకౌంట్ కి 9,99,99,999 రూపాయలు క్రెడిట్ అయినట్టు ఎస్ఎంఎస్ వచ్చింది. దీనిని ఫేక్ మెసేజ్ గా భావించిన వినోద్, దానిని తన సన్నిహితులు, బంధువులకు చూపించాడు. వారు అది ఫేక్ మెసేజ్ కాదని, నిజంగానే ఆ మొత్తం క్రెడిట్ అయిందని అతనికి వివరించారు.
దీంతో ఉన్నపళంగా తాను కోటీశ్వరుడైపోయానని వినోద్ సంబరపడిపోయాడు. దీంతో అంత మొత్తం బ్యాంకులో ఉంచడం ఎందుకని కొంత మొత్తం విత్ డ్రా చేసుకునేందుకు దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాడు. అయితే, అకౌంట్ బ్లాక్ అయినట్టు సమాధానం వచ్చింది. దీంతో షాక్ తిన్న వినోద్ బ్యాంక్ మేనేజర్ ని కలిసి తన అకౌంట్ బ్లాక్ అయిందని, అన్ బ్లాక్ చేయాలంటూ అప్లికేషన్ ఇచ్చాడు. అయితే వినోద్ ఖాతాలో డబ్బు ఉందా? లేదా? అన్న విషయం మాత్రం వారు వెల్లడించకపోవడం విశేషం.