KCR: టీడీపీ కూడా బయటకు వచ్చేసింది.. ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నిస్తున్నా!: గవర్నర్ తో కేసీఆర్
- ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దూరమవుతున్నాయి
- ఎన్డీయే నుంచి టీడీపీ కూడా బయటకు వచ్చేసింది
- కేంద్రంలో సత్తా చాటుతాం
గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మధ్యాహ్నం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరపాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్న తీరును గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ తదితర అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి.
బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ శక్తులను ఏకం చేసే పనిలో ఉన్నామని ఈ సందర్భంగా గవర్నర్ కు కేసీఆర్ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తన భేటీ ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ఏపీ, మహారాష్ట్రల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దూరమవుతున్నాయని... ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా శక్తులను ఏకం చేసి, కేంద్రంలో సత్తా చాటుతామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తాను వేస్తున్న అడుగులన్నీ సవ్యంగానే పడుతున్నాయని చెప్పారు. గవర్నర్ తో కేసీఆర్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ వివరాలను ఆయనకు తెలిపినట్టు తెలుస్తోంది.