Uttar Pradesh: యూపీలో కాపీ కొడుతూ డాక్టర్లవుతున్న తీరు... ఆరుగురి అరెస్ట్
- 2014 నుంచి ఇలా కాపీ కొట్టి పాస్ అయింది 600 మంది
- వీరంతా ఇప్పుడు డాక్టర్లుగా చలామణి
- విద్యార్థులకు పరీక్షల్లో జవాబులు అందిస్తున్న మాఫియా
ఉత్తరప్రదేశ్ లో కాపీ డాక్టర్ల బాగోతం బయటపడింది. ప్రతిభతో కాకుండా పరీక్షల్లో కాపీ కొడుతూ డాక్టర్లవుతున్న తీరు వెలుగు చూసింది. ఈ కేసులో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి చెందిన నలుగురు ఉద్యోగులను, ఇద్దరు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ 'వ్యాపం స్కామ్'గా పేర్కొంటున్నారు. వ్యాపం స్కామ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ తరహా ఘటనే. అందుకే తాజాగా వెలుగులోకి వచ్చినదాన్ని ఉత్తరప్రదేశ్ వ్యాపం స్కామ్ గా పేర్కొంటున్నారు.
యూపీలో 2014 సంవత్సరం నుంచి సుమారు 600 మంది వైద్య విద్యార్థులు కాపీ కొట్టి ఎంబీబీఎస్ పాస్ అయినట్టు తెలిసింది. వీరికి ఓ మాఫియా రాకెట్ సహకరించింది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముజఫర్ నగర్ మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. వీరు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున మాఫియాకు చెల్లిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిపుణులు రాసిన సమాధాన పత్రాలను అసలు విద్యార్థుల జవాబు పత్రాల స్థానంలో మాఫియా ప్రవేశపెడుతున్నట్టు తెలిసింది. వీరికి సహకరిస్తున్న చరణ్ సింగ్ వర్సిటీ ఉద్యోగులు ఆరుగురిని గుర్తించారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు.