Lok Sabha: ప్రారంభమైన 30 సెకన్లకే వాయిదా పడిన లోక్సభ....రాజ్యసభ రేపటికి
- లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు..రాజ్యసభ రేపటికి వాయిదా
- రిజర్వేషన్లపై టీఆర్ఎస్, కావేరీ బోర్డుపై అన్నాడీఎంకే ఉభయసభల్లో ఆందోళనలు
- వెల్లోకి చొచ్చుకొచ్చిన వైనం...ఎంత వారించినా వినకపోవడంతో స్పీకర్ వాయిదా నిర్ణయం
ఈ రోజు లోక్సభ ప్రారంభమైన 30 సెకన్లకే వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఓ వైపు టీడీపీ, వైకాపాలు పట్టుబడుతుండగా మరోవైపు కావేరీ జలాలపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ రెండు పార్టీలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో రభస చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా విపక్షాలు వినకపోవడంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
లోక్సభలో అవిశ్వాసంపై నాలుగోరోజైన ఈ రోజు కూడా అదే సీను చోటు చేసుకోవడంతో టీడీపీ, వైకాపాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే సీను చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం సభలో విపక్ష అన్నాడీఎంకే, టీఆర్ఎస్లు అందోళనలు చేపట్టాయి. సభ సజావుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై విపక్షాలు దృష్టి సారిస్తున్నాయి.