beggers population: మన దేశంలో పెరిగిపోతున్న భిక్షువులు... 4 లక్షలు దాటిన సంఖ్య!
- 81,000 మందితో ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్
- 65,835 మందితో యూపీ రెండో స్థానంలో
- ఏపీలో 30,128 మంది... దేశంలో మూడో స్థానం
- లోక్ సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి గెహ్లాట్
మన దేశంలో బిక్షమెత్తుకుని జీవనం సాగించే వారి సంఖ్య తెగ పెరిగిపోతోంది. వారి జనాభా 4 లక్షలు దాటిపోయింది. ముఖ్యంగా 81,000 మంది జనాభాతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం భిక్షువులకు నిలయంగా మారింది. అతి తక్కువగా ఉన్నది లక్షద్వీపంలో. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,13,670 మంది భిక్షగాళ్లు దేశంలో జీవిస్తున్నట్టు, వీరిలో 2,21,673 మంది మగవారు కాగా, మిగిలిన జనాభా మహిళలదని కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ లోక్ సభకు తెలిపారు.
81,000 మందితో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా, 65,835 మందితో యూపీ రెండో స్థానంలో, 30,128 మందితో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. భిక్షువులు తక్కువగా ఉన్నది కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే. లక్షద్వీప్ లో కేవలం ఇద్దరే ఉన్నారని మంత్రి సెలవిచ్చారు. దాద్రానగర్ హవేలిలో 19 మంది, డామన్ అండ్ డయ్యూలో 22 మంది, అండమాన్ నికోబార్ లో 56 మంది భిక్షమెత్తుకుంటున్నారు.