bihar: కేంద్రానికి మరో తలనొప్పి... బీహార్ ప్రత్యేక ప్యాకేజీపై లోక్ సభలో నోటీసు!
- లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసిచ్చిన పప్పూ యాదవ్
- తక్షణమే చర్చ జరపాలన్న జన్ అధికార్ పార్టీ
- ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పట్టుబడుతున్న నితీష్ కుమార్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పార్లమెంటు ఉభయ సభలను నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేస్తూ, రోజులు గడిపే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్రానికి మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ లోక్ సభ తలుపు తట్టింది. తక్షణమే బీహార్ కు ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలంటూ జన్ అధికార్ పార్టీ (జేఏపీ) ఎంపీ పప్పూ యాదవ్ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చారు.
మరోవైపు, రెండ్రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, 13 ఏళ్ల క్రితమే ప్రత్యేక హోదా అంశాన్ని తాను లేవనెత్తానని చెప్పారు. ఈ డిమాండ్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2005లోనే ప్రత్యేక హోదా కోసం అప్పటి ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. ఏడాది తర్వాత ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించామని... అప్పటి నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబడుతూనే ఉన్నానని చెప్పారు.