Chandrababu: సాయం చేయమని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు!: కేంద్ర సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం
- రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగింది
- ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు
- అంతేగాక కేంద్ర ప్రభుత్వ నేతలు అవహేళనగా మాట్లాడారు
- సాయం చేయమని అడిగితే మన రాష్ట్రం మీద ఎదురుదాడికి దిగారు
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని, ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని, అంతేగాక కేంద్ర ప్రభుత్వ నేతలు అవహేళనగా మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్ర ప్రభుత్వంతో చాలా సార్లు చర్చలు జరిపినా సాయం చేయలేదని, పైగా, సాయం చేస్తున్నామని చెబుతున్నారని అన్నారు. సాయం చేయమని అడిగితే మన రాష్ట్రం మీద ఎదురుదాడి చేస్తున్నారని, ఇంకా ఏదో చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.
న్యాయం చేయమని అడగడం తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోజు అమరావతిలోని ఉండవల్లిలో మహిళా సాధికార మిత్రలతో ముఖాముఖిలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతకీ సాయం చేయకపోవడంతో ఇక తాను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి తమ నేతలను వైదొలగమని చెప్పానని అన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని చెప్పామని, అయినప్పటికీ సాయం చేయలేదని అన్నారు. ఇక లాభం లేదనే ఎన్డీఏ నుంచి వైదొలిగామని అన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు.