Jagan: పూటకో మాట మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను చక్కగా మోసం చేస్తున్నారు!: జగన్
- చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు
- 2016లో చెప్పిన మాటే జైట్లీ మొన్న మళ్లీ చెప్పారు
- అప్పట్లో ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు
- ఈ పని 2016లోనే చేసి ఉంటే ఇప్పటికే హోదా వచ్చేది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ నాలుగేళ్లు గట్టిగా అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేదని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు దగ్గరుండి నీరుగార్చారని అన్నారు.
ఎన్నికల ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారని, 2016లో అర్ధరాత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబితే ఆయనకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారని జగన్ అన్నారు. మొన్న అరుణ్ జైట్లీ మళ్లీ అదే స్టేట్ మెంట్ ఇచ్చారని, అప్పట్లో జైట్లీ చేసిన ప్రకటనకు ఇప్పుడు చేసిన దానికి ఏమీ తేడాలేదని అన్నారు. కానీ అప్పట్లో అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తమ నేతలను వైదొలిగించారని అన్నారు.
ఈ పని 2016 సెప్టెంబరులో అరుణ్ జైట్లీ ప్రకటన చేసినప్పుడే చేసి ఉంటే ఇప్పటికే హోదా వచ్చేదని జగన్ అన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల తరువాత హోదా సంజీవని కాదని చెప్పారని, ప్రత్యేకహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు అన్నారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా రాగాన్ని ఎత్తుకున్నారని జగన్ విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను చక్కగా మోసం చేస్తున్నారని, అయినప్పటికీ ఏ మీడియా చంద్రబాబుని ప్రశ్నించడం లేదని అన్నారు.
రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఉన్నారని, ఉద్యోగాల కోసం వారు ఎక్కడికి పోవాలని జగన్ ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తుందని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడారో, ఎన్నికల తరువాత ఏం అన్నారో, మళ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గుర్తించాలని జగన్ అన్నారు.