kothapalli geetha: కొత్తపల్లి గీతకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన వైసీపీ.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్న అరకు ఎంపీ
- విప్‌ను ఉల్లంఘించాంటూ నోటీసులు జారీ
- వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్న వైసీపీ
- కోర్టుకు వెళ్తానన్న అరకు ఎంపీ
లోక్‌సభలో తాము జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు బుధవారం వైసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘‘విప్‌ను ఉల్లంఘించిన మీపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వండి’’ అంటూ ఆ పార్టీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడంతో ఈనెల 19న విప్ జారీ చేశామని పేర్కొన్న సుబ్బారెడ్డి.. 20న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న వారిని లేచి నిలబడమని స్పీకర్ రూలింగ్ ఇచ్చినా గీత నిలబడలేదని పేర్కొన్నారు. ఇది విప్‌ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
తనకు పంపిన షోకాజ్ నోటీసులపై గీత వివరణ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు మాత్రమే విప్ చెల్లుతుందని, ఇతరత్రా చెల్లదని తేల్చి చెప్పారు. తాను నిలబడకపోవడం అన్నది విప్ ఉల్లంఘన అవదన్నారు. తనపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. ఇటువంటి నోటీసులతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నందుకు కోర్టుకు వెళ్లే హక్కు తనకు ఉందని గీత స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు తాను పార్లమెంటు భవనంలో మోదీని కలిసినట్టు గీత చెప్పారు. రాష్ట్రానికి సాయం చెయ్యమని ప్రధానిని కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని గీత తెలిపారు.