Chittoor MP Siva Prasad: గబ్బు పట్టిపోనీ... నేను క్లీన్ చేయను... నేడు పారిశుద్ధ్య కార్మికుడిగా వేషం వేసిన చిత్తూరు ఎంపీ!
- రోజుకో వేషంలో పార్లమెంట్ కు వస్తున్న శివప్రసాద్
- మోదీ మనసునిండా కల్మషమే
- ప్రజలే ఊడ్చేస్తారని ఎద్దేవా
ఒక రోజు సాధారణ గృహిణి, మరో రోజు చదువుకునే పిల్లాడు, ఇంకోరోజు సత్యహరిశ్చంద్రుడు... ఇలా రోజుకో వేషంలో పార్లమెంట్ కు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, నేడు పారిశుద్ధ్య కార్మికుని వేషధారణలో వచ్చారు. ఆపై ఆయన మాట్లాడుతూ, "సార్... కార్మికుడిగా నేను ఈ పని చేయను సార్. ఎందుకు సార్ క్లీన్ చేయాలి నేను? చెత్త పేరుకుపోనీ... గబ్బుపట్టి పోనీ... ఆయన ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నట్టు ప్రధాన మంత్రిగారు ఊదర గొడుతున్నారు. స్వచ్ఛ భారత్ అని.
గ్రామాలన్నీ బాగుండాల. టౌన్లు బాగుండాల. వ్యక్తిగత మరుగుదొడ్లుండాల... అవన్నీ ఉపన్యాసాలు ఇచ్చేందుకేనా? ఆయన మనసు ఏమిటండీ. ఆయన మనసులో చంద్రబాబునాయుడి మీద ద్వేషం. అక్రమాలు చేయాలని, అన్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ ఇవ్వకుండా డెవలప్ మెంట్ ఆపాలని దురాలోచననే కల్మషం, శంక పేరుకుపోయాయి.
ఆయన తన మనసును క్లీన్ గా పెట్టుకోకుండా, అన్ని రాష్ట్రాలనూ ఒకలా చూడకుండా... కష్టపడే ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా, నిధులు ఇవ్వకుండా మనసునంతా కల్మషం చేసుకున్నాడాయన. ఇప్పుడు కావాల్సింది స్వచ్ఛ భారత్ కాదండీ. స్వచ్ఛ మోడీ" అంటూ ఎద్దేవా చేశారు. ఆయన పైకి క్లీన్ గా కనిపిస్తున్నాడని, మనసును కూడా క్లీన్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వకుంటే నరేంద్ర మోడీని ప్రజలు ఊడ్చేస్తారని హెచ్చరించారు.