national helath policy: ఉచిత ఆరోగ్య బీమా వచ్చేస్తోంది... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
- ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ఏర్పాటు
- ఇందుకు ఆమోదం తెలిపిన కేబినెట్
- 10 కోట్ల పేద కుటుంబాలకు అర్హత
- ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల కవరేజీ
మోదీ సర్కారు పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా అందించే దిశగా తొలి అడుగు వేసింది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మిషన్ ఆరోగ్య బీమా వ్యవహారాలను చూస్తుంది. కుటుంబం మొత్తానికి ఒక ఏడాదిలో రూ.5 లక్షల ఆరోగ్యబీమా అందించే ఈ పాలసీ ప్రీమియం గరిష్టంగా 2,000 మాత్రమే ఉండాలన్న షరతు విధించారు.
ఈ ప్రీమియం ప్రజలు చెల్లించక్కర్లేదు. కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు ఈ కవరేజీ పరిమితం కానుంది. ఈ పథకం నిర్వహణకు ఏటా రూ.10,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. ‘‘రెగ్యులర్ హెల్త్ పాలసీలో రూ.5 లక్షల కవరేజీకి రూ.3,500 నుంచి రూ.5,000 వరకు ఖర్చవుతుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ ఉండదు. కానీ, కేంద్రం తీసుకొస్తున్న పాలసీలో అన్ని ముందస్తు వ్యాధులకు కవరేజీ ఉంటుంది’’ అని ఓ బీమా కంపెనీ అధికారి తెలిపారు.