Brahmos: గంటకు 7,170 కి.మీ. వేగం... సరికొత్త బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ గ్రాండ్ సక్సెస్!
- పోఖ్రాన్ అణు కేంద్రం నుంచి ప్రయోగం
- లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
- కొత్త తరం క్షిపణి విజయవంతంతో అధికారుల ఆనందం
అత్యాధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని నేడు పరీక్షించిన అధికారులు విజయం సాధించారు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ అణు క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించగా, ఇది లక్ష్యాన్ని ఛేదించింది. గత సంవత్సరం నవంబర్ లో భారత వాయుసేన యుద్ధ విమానం సుఖోయ్ - 30 నుంచి విజయవంతంగా పరీక్షించిన బ్రహ్మోస్ క్షిపణికి ఇది లేటెస్ట్ వర్షన్.
గతంలో 2.8 నుంచి 4.0 మాక్ ల వేగంతో (ఒక మాక్ అంటే గంటకు 1,234.8 కిలోమీటర్ల వేగం) దూసుకెళ్లే క్షిపణి వేగాన్ని 5.0 మాక్ లకు పెంచారు. అంటే గంటకు ఈ క్షిపణి 7,170 కి.మీ. వేగంతో దూసుకుపోతుందన్నమాట. 2017లో దుబాయ్ ఎయిర్ షోలో బ్రహ్మోస్ ను ప్రదర్శించిన వేళ, పలు దేశాల అధికారులు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. తాజా క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
బ్రహ్మోస్ విశేషాలు...
ఇది మీడియం రేంజ్ రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. నేలపై నుంచి, నీటి నుంచి, గాల్లో నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత ప్రభుత్వ డీఆర్జీవో, రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ ల ఉమ్మడి వెంచర్ ఈ క్షిపణులను తయారు చేస్తోంది. ఇండియాలోని బ్రహ్మపుత్రా నదిలోని మొదటి మూడక్షరాలతో పాటు రష్యాలోని మాస్కోవా నదిలోని తొలి మూడక్షరాలనూ కలిపి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ప్రపంచంలోనే బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత వేగంగా ప్రయాణించే యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులుగా నిలిచాయి. తొలి తరం బ్రహ్మోస్ 2006లో తయారైంది.