fiji: ఫిజీ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఇలియానా!
- బ్రాండ్ అంబాసిడర్ గా ఫిజీలో పర్యటిస్తున్న ఇలియానా
- ఫిజీతో భారత్ కు బలమైన సాంస్కృతిక సంబంధాలు
- ఫిజీలో 38 శాతం మంది భారత సంతతి ప్రజలు
నాజూకు సుందరి ఇలియానా ఫిజీ దేశపు పర్యాట శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది. ఈ హోదాలో ప్రస్తుతం ఫిజీలో పర్యటిస్తున్న ఇలియానా దీనిపై స్పందిస్తూ, ‘అందాల దేశం ఫిజీతో కలిసి పనిచేయనుండటం ఆనందంగా ఉంది. వారి ఆతిథ్యం, ప్రేమ నాకు సొంతింటిలో ఉన్న ఫీలింగ్ కలిగించింది. ఇంకా చాలా ప్రదేశాలు చూసిన తరువాత తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’ అంటూ పేర్కొంది.
కాగా, ఫిజీ దేశంతో భారత్ కు బలమైన సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఫిజీలో నివసిస్తున్న దాదాపు 38 శాతం ప్రజలు భారత సంతతికి చెందిన వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఫిజీలో పర్యటించే భారతీయుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో భారతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలన్న లక్ష్యంతో ఇలియానాను ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.
దీనిపై ఫిజీ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, భారతీయ పండగలైన దీపావళి, వినాయక చవితిని తాము ఘనంగా జరుపుకుంటామన్నారు. ఇలియానాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం వల్ల తమ దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా, గతంలో ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్ గా పరిణతి చోప్రా, న్యూజిలాండ్ బ్రాండ్ అంబాసిడర్ గా సిద్ధార్థ్ మల్హోత్రాలు వ్యవహరించారు. వారి జాబితాలో ఇలియానా కూడా చేరింది.