anna hazare: రాంలీలా మైదాన్ లో నేటి నుంచి అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష
- మూడు ప్రధాన డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నాహజారే
- లోక్ పాల్ బిల్లు అమలు
- రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకం
- రైతులను ఆదుకోవడం కోసం స్వామినాథన్ సిఫారసుల అమలు
ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదాన్ లో నేటి నుంచి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారు. కేంద్రంలో లోక్ పాల్ బిల్లు అమలు, రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకం, దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడం కోసం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలన్న మూడు డిమాండ్ లతో ఆయన ఈసారి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును అమలు చేసేంత వరకు నిరవధిక నిరాహారదీక్ష కొనసాగించాలని ఆయన నిర్ణయించారు.
రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపిత గాంధీకి నివాళులర్పించిన అనంతరం తన ముఖ్య అనుచరులతో షహీద్ పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారు. కాగా, ఏడేళ్ల క్రితం అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలని పేర్కొంటూ, లోక్ పాల్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేబట్టిన విషయం విదితమే.