ANNA HAZARE: మరోసారి లోక్ పాల్ కోసం కదిలిన అన్నాహజారే... ఢిల్లీలో మొదలైన నిరాహార దీక్ష
- కేంద్రం తీరుపై విమర్శలు
- లోక్ పాల్ తో 80 శాతం అవినీతి తగ్గుతుంది
- అవినీతి అంతం కావాలని రాజకీయ నేతలు కోరుకోవడం లేదు
- లోక్ పాల్ అమలు చేయకపోగా, నిర్వీర్యం చేస్తున్నారన్న హజారే
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి లోక్ పాల్ వ్యవస్థ కోసం ఉద్యమం మొదలు పెట్టారు. అవినీతి నిర్మూలనకు లోక్ పాల్ ను ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరవధిక నిరాహార దీక్షను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్ పాల్ బిల్లుతో 80 శాతం అవినీతి అంతం అవుతుందని, రాజకీయ నేతలు మాత్రం దానిని కోరుకోవడం లేదని అన్నారు. వారు లోక్ పాల్ ను అమలు చేయకపోగా, ఇంకా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన సత్యాగ్రహ నిరసనకు ప్రభుత్వం అవాంతరాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
‘‘ఢిల్లీకి నిరసన కారులను తీసుకొచ్చే రైళ్లను రద్దు చేశారు. వారు హింసకు పాల్పడేలా చేయాలని అనుకుంటున్నారు. నా కోసం పోలీసులను నియమించొద్దని లేఖలు రాసినా గానీ, నియమించారు. మీ రక్షణ నన్ను కాపాడలేదు’’ అని హజారే ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హజారే 2011లోనూ రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అవినీతి కేసులను స్వతంత్రంగా విచారించేందుకు గాను కేంద్రం స్థాయిలో లోక్ పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటుకు హజారే డిమాండ్ చేస్తున్నారు.