budda venkanna: ఆపరేషన్ 'ద్రవిడ' డబ్బులు పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలి: బుద్ధా వెంకన్న డిమాండ్
- అవిశ్వాసానికి మోదీ భయపడుతున్నారు
- బీజేపీ ఎంపీలు కూడా వ్యతిరేకంగా ఓటేస్తారేమో అనే భయం పట్టుకుంది
- ఆపరేషన్ ద్రవిడ నిజమే
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి 160 మంది ఎంపీలు మద్దతు పలికారని... దీనికి తోడు వ్యక్తిగతంగా ప్రధాని మోదీపై పలువురు బీజేపీ ఎంపీల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వీరందరూ... అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రారంభించగానే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అనే భయంతో మోదీ ఉన్నారని ఎద్దేవా చేశారు.
అందుకే గత ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానాన్ని ఇస్తున్నప్పటికీ, లోక్ సభలో చర్చను చేపట్టలేదని అన్నారు. హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ అనేది కచ్చితంగా జరుగుతోందని వెంకన్న చెప్పారు. ఎదుటి వ్యక్తుల్ని అణచివేసే ధోరణి మోదీకి ఉందని... అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీని ఇబ్బంది పెట్టే పనులు చేపట్టారని అన్నారు. ఆపరేషన్ ద్రవిడకు కేటాయించిన వేల కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.