Congress: బీజేపీ, టీడీపీ రెండూ కుట్ర చేశాయి : రఘువీరారెడ్డి
- ఏపీకి ‘హోదా’ ఇస్తే కాంగ్రెస్ కు మంచి పేరొస్తుందని భావిస్తున్నారు
- అందుకే, బీజేపీ, టీడీపీలు కుట్రలు చేశాయి
- ఈ రెండు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి
- 2019లో ఏపీకి ‘హోదా’ను అమలు చేసేది కాంగ్రెస్సే
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని భావించిన టీడీపీ, బీజేపీలు రెండూ కుట్ర చేశాయని, నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏపీసీసి చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. నాడు తాడేపల్లిగూడెం లో అమిత్ షా రూ.1.40 లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిందని, ఈరోజు చంద్రబాబు స్పందించినప్పటికీ విశ్వసనీయత లేదని విమర్శించారు.
మోదీ, అమిత్ షా లిద్దరూ అబద్ధాల కోరులేనని, వారికి విశ్వసనీయత లేదని అన్నారు. ఏపీ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయింది కానీ, ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలా న్యాయం చేసేందుకు ప్రయత్నించిందని, ఐదేళ్లు ప్రత్యేక హోదా, నాటి ప్రధాని మన్మోహన్ హామీలు, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే సుమారు 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి లభిస్తాయని అన్నారు.
ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే, దాన్ని బీజేపీ, టీడీపీలు రాజకీయ అవకాశవాదం కోసం కుక్కలు చింపిన విస్తరిలా తయారుచేశారని రఘువీరా మండిపడ్డారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీస్తే, ఐదు కోట్ల ప్రజల హోదా హక్కును, ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర చంద్రబాబు పెట్టారని ఆగ్రహించారు. ఏపీకి అన్యాయం జరగడానికి బాధ్యులైన మోదీ, చంద్రబాబు లిద్దరూ కాంగ్రెస్ పార్టీపై ఇంకా నిందలు వేస్తూ పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.
అసత్యాల అమిత్ షా, మోసకారి మోదీ, వెన్నుపోటు చంద్రబాబు వీరంతా ఏపీని ముంచినోళ్లేనని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ‘హోదా’ అమలు కోసం పోరాటం మొదలు పెట్టింది కూడా తమ పార్టీయేనని, 2019లో ఆ ‘హోదా’ను అమలు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.