Saras: ఇండియాలో తయారైన తొలి పాసింజర్ విమానం 'సరస్'... విశేషాలివి!
- 2009లో క్రాష్ అయిన 'సరస్' విమానం
- అప్పట్లో ఇద్దరు పైలెట్ల మృతితో ఆగిన ప్రాజెక్టు
- తిరిగి ప్రారంభమై విజయవంతంగా టెస్ట్ రన్
2009లో తొలిసారిగా పరీక్షల దశలో ఉన్న వేళ, క్రాష్ అయి, ఆపై 2016లో తిరిగి నిర్మాణాన్ని ప్రారంభించిన తొలి దేశవాళీ విమానం 'సరస్' ఈసారి రెండు పరీక్షలను తట్టుకుని నిలబడి భారత సాంకేతిక సత్తా మరింతగా పెరిగిందని నిరూపించింది. దాదాపు 7 వేల కిలోల బరువుండే ఈ విమానం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విమానం కాగా, మొత్తం 24 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఓ చిన్న తప్పు కారణంగానే అప్పట్లో విమానం కూలిపోయిందని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ చీఫ్ జితేంద్ర జే జాధవ్ వ్యాఖ్యానించారు. ఈ దఫా ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకున్నామని తెలిపారు. 2022 నాటికి ఈ విమానాల విక్రయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక సరస్ విశేషాలను పరిశీలిస్తే...
* దీని ఖరీదు కేవలం రూ. 45 కోట్లు మాత్రమే.
* ఇండియాలో ఇప్పుడున్న ఇదే తరహా విమానాల ఖరీదు రూ. 60 కోట్లు
* టర్బో ప్రాప్ ఇంజన్ ను ఇందులో వాడారు.
* 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'సరస్' ప్రాజెక్టును విమానం క్రాష్ తరువాత 2009లో నిలిపివేశారు.
* అప్పటి విమానం క్రాష్ లో ఇద్దరు చనిపోయారు.
* తిరిగి 2016లో బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ తిరిగి ప్రాజెక్టును ప్రారంభించింది.
* 19 మంది ప్రయాణికులు సహా పైలట్లు, సిబ్బంది సహా మొత్తం 24 మంది ఇందులో ప్రయాణించే వీలుంటుంది.
* దగ్గరి ప్రాంతాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది.
* వచ్చే పదేళ్లలో ఇండియాకు 160 చిన్న విమానాల అవసరమున్న నేపథ్యంలో 'సరస్' ప్రాజెక్టుకు మరిన్ని నిధుల కేటాయింపు.