NIMS: హైదరాబాద్‌లో కలకలం...ఉరేసుకుని నిమ్స్‌ వైద్య విద్యార్థి ఆత్మహత్య

  • నగరంలోని నిమ్స్‌లో న్యూరాలజీ విభాగంలో డీఎం మొదటి సంవత్సరం చదువుతున్న తణుకు వాసి శివతేజ
  • ఆదివారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
  • మృతికి గల కారణాలు తెలియదని పోలీసుల వెల్లడి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • మృతుడు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండేవారని తోటి సిబ్బంది వెల్లడి

హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగంలో డీఎం మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అందించిన వివరాల్లోకెళితే....పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన పులగం శివతేజా రెడ్డి (31) శనివారం అర్థరాత్రి వరకు విధులు నిర్వహించి 12 గంటల ప్రాంతంలో బస చేసేందుకు నిమ్స్‌లోని డాక్టర్స్ క్లబ్‌కు వెళ్లారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తకపోవడంతో సిబ్బంది ఆయన బస చేసిన గదికి వెళ్లారు. కిటికీలోంచి చూడగా శివతేజ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు.

వెంటనే తోటి వైద్యులకు సమాచారమివ్వడంతో వారొచ్చి పరిశీలించగా ఆయన అప్పటికే మరణించినట్లు నిర్థారించారు. మృతదేహాన్ని నిమ్స్‌ మార్చురీలో భద్రపరిచారు. మృతుని తల్లిదండ్రులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అందువల్ల ఆయన మరణ సమాచారాన్ని తన చిన్నమ్మ డాక్టర్ సరస్వతికి తెలిపారని పంజాగుట్ట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. శివతేజ మరణానికి గల కారణాలు తెలియరాలేదని ఆయన చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. శివతేజ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే వారని తోటి వైద్యులు చెబుతున్నారు. రూ.40 వేలు వెచ్చించి పేదల కోసం జిరాక్స్ యంత్రాన్ని నిమ్స్‌కు అందించారని ఆసుపత్రి మెడికల్ సూపరింటిండెంట్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News