Telangana: ‘అవిశ్వాసం’పై చర్చకు మా వల్ల ఆటంకం కలిగే పరిస్థితి రానివ్వం : ఎంపీ జితేందర్ రెడ్డి
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నాం
- వారం రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రంలో కదలిక లేదు
- ‘అవిశ్వాసం’పై చర్చ జరిగితే మా డిమాండ్లు ప్రస్తావిస్తాం : జితేందర్
కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తమ వల్ల ఆటంకం కలిగే పరిస్థితి రానివ్వమని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నామని అన్నారు.
వారం రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. తాము చేస్తున్న ఆందోళనను సాకుగా తీసుకుని, లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ వాయిదా వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ డిమాండ్లను ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.