sasikala pushpa: కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. రెండో వివాహం చేసుకున్న ఎంపీ శశికళ పుష్ప
- రామస్వామిని రెండో వివాహం చేసుకున్న శశికళ
- ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన రామస్వామి మొదటి భార్య
- విచారణ ముగిసేంత వరకు మరో పెళ్లి చేసుకోకూడదని కోర్టు ఆదేశం
అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప (41) రెండో వివాహం చేసుకున్నారు. న్యాయవాది, ప్రొఫెసర్ రామస్వామిని ఆమె పెళ్లాడారు. వీరి వివాహం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో నిన్న జరిగింది. తొలి భర్త లింగేశ్వరతో విభేదాలు తలెత్తడంతో, ఆమె చట్ట ప్రకారం ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.
రామస్వామితో రెండో వివాహానికి శశికళ సిద్ధమైనట్టు వార్తలు వచ్చిన వెంటనే... రామస్వామి భార్య సత్యప్రియ తెరమీదకు వచ్చారు. తామిద్దరికీ గతంలోనే పెళ్లయిందని, రిజుస్న అనే కుమార్తె కూడా ఉందని ఆరోపిస్తూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. సాక్ష్యాధారాలుగా ఫొటోలను కూడా చూపించారు. ఇదే విషయాన్ని మధురై కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, విచారణ ముగిసేంత వరకు రామస్వామి వివాహం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ శశికళ, రామస్వామిలు నిన్న వివాహం చేసుకున్నారు.