khap panchayat: ఖాప్ పంచాయతీలకు సుప్రీంకోర్టు చెక్... మేజర్ల వివాహాలను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని తీర్పు
- ఓ స్వచ్చంద సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
- వివాహ చెల్లుబాటును తేల్చే బాధ్యత చట్టానిదని స్పష్టీకరణ
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ఆగ్రహం
ఉత్తరాది రాష్ట్రాల్లో కులాంతర వివాహాలను అడ్డుకుంటూ, పరువు హత్యలకు పాల్పడుతున్న ఖాప్ పంచాయతీల అరాచకాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఇద్దరు మేజర్ల మధ్య వివాహానికి అడ్డు పడితే అది చట్టవిరుద్ధం అవుతుందని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్ల మధ్య వివాహాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఏ పంచాయతీ అయినా అది చట్ట విరుద్ధమేనంటూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
శక్తి వాహిని అనే స్వచ్చంద సంస్ధ 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరువు హత్యల నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. దీంతో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ముగించి తీర్పు జారీ చేసింది. చట్టాలను చేతుల్లోకి తీసుకుని పరువు పేరిట హత్యలకు పాల్పడితే సహించేది లేదని విచారణలో భాగంగా కోర్టు గత నెలలో ఖాప్ పంచాయతీలపై కఠినంగా స్పందించింది. ఈ పని కోసం వారిని నియమించలేదని, నిరోధానికి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇద్దరు మేజర్లు వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు అవుతుందా? కాదా? అన్నది తేల్చేందుకు చట్టం ఉందని, దాన్ని నిర్ణయించడానికి ఖాప్ పంచాతీయలకు ఏం అధికారం ఉందని కోర్టు ప్రశ్నించింది.