Woman: ఈ గోల పడలేకపోతున్నాను... విడాకులిప్పించండి!: బీహార్ మహిళ విజ్ఞప్తి
- లౌడ్ స్పీకర్ల మోత భరించలేక విడాకులు డిమాండ్ చేసిన బీహార్ మహిళ
- బాధితురాలి భర్త గతంలో ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
- ప్రధాని, బీహార్ సీఎంలకు లేఖల ద్వారా వినతి...స్పందన రాకపోవడంతో విడాకుల కోసం డిమాండ్
ఈ గోల పడలేకపోతున్నానని, విడాకులిప్పించాలని బీహార్ కు చెందిన ఓ మహిళ డిమాండ్ చేస్తోంది. ప్రభాత్ ఖబర్ దినపత్రిక కథనం ప్రకారం, బీహార్‌లోని వైశాలి జిల్లాకి చెందిన స్నేహా సింగ్ ఇంటి చుట్టూ రోజూ మతపరమైన కార్యక్రమాలకు లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తున్నారు. ఆ శబ్దం తనకు ఇబ్బందిగా ఉందని, ఏదో ఒకటి చేయండంటూ తన భర్త రాకేశ్‌ను కోరింది. గతంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అయిన రాకేశ్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాడు.
ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ), బీహార్ సీఎం నితీశ్ కుమార్, ప్రధాని మోదీలకు కూడా ఆమె లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. చివరకు వారి నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో ఈ స్పీకర్ల మోత తాను భరించలేనని, తన భర్త నుంచి విడాకులిప్పించమని స్నేహా సింగ్ డిమాండ్ చేసింది. అయితే ఓపిక పట్టమ్మా అంటూ ఆమెను తన కుటుంబసభ్యులు వారిస్తున్నారు.
మరోవైపు లౌడ్ స్పీకర్ల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. కాగా, కొందరు దుర్మార్గులు తమ ఇంటిపై గతంలో రాళ్లు రువ్వారని, కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.